బూచోడు

అందరి ఇంటి ముందు రంగుల ముగ్గిళ్ళే
పిండి పోయి రంగు వచ్చింది
రంగులు అట్టహాసంగా బజార్లను అలంకరించాయి
వరి పిండెక్కడ?

ముగ్గులో పిండి కలుపు.
గీత అందంగా వస్తుంది అనే ఆమ్మ మాటలు
ఎక్కడో లీలగా లోపలి పొరల్లో

రైతు యింట్లో వడ్ల గింజలు మాయమయ్యాయి
వడ్ల గుమ్మి చరిత్రకు చిహ్నం అయింది
ఇంటి ముందు పాతరలు
తరాలకు తెలియని పదాలు అయ్యాయి

ఒకనాటి పసిపిల్లల మారాం లో
అమ్మలు అమ్మమ్మల స్నేహితుడు బూచోడు
అన్నం తినక పోతే బూచోడు ఎత్తుకు పోతాడన్నారు

అప్పుడు అర్ధం అవ్వని పదాలు యిప్పుడు
తీరిగ్గా కళ్లముందు వచ్చి నిలుచున్నాయి
వికటాట్టహాసం చేస్తున్నాయి
అన్నీ రూపాలు మార్చుకున్నాయి
కాదు చక్కటి రంగులు చిక్కగా వేశారు
వేసిన వారెవరు?
వెతుకుదాం పదండి
మన పిండిని మనం తెచ్చుకుందాం
నాతో వచ్చేవారెవ్వరు? వారిని కూడ వెతుకుదాం.

Published on